Geetha Koumudi-1    Chapters   

పదకొండవ కిరణము

కృష్ణునిబోధ సాంఖ్యయోగము

(గీత-2వ అధ్యాయము)

గీతలోని 2వ అధ్యాయమైన సాంఖ్యయోగములో కృష్ణ పరమాత్మ తనబోధను 11వ శ్లోకముతో ప్రారంభించినాడనిన్నీ, ఆశ్లోకములో 3 భావము లున్నవనిన్నీ మొదటి భావము ఏడ్వకూడనివారికోసం అర్జునుడు ఏడుస్తున్నాడు అను భావమనిన్నీ లోగడ మనము తెలిసికొనియున్నాము. ఏడవకూడనివారు అనుటలో ఏడ్వకూడని తనము అనగా అశోచ్యత్వము ఇమిడియున్నది కనుక దానియొక్క స్వరూపము, అది ఎన్నిరకములుగా నున్నది మనము తెలిసికొనవలసియున్నది.

సాంఖ్యయోగము అను 2వ అధ్యాయములో 72 శ్లోకము లున్నను, దానిలోని మొదటి 10 శ్లోకములు మొదటి అధ్యాయమైన అర్జున విషాదయోగమునకు చెందినవే కనుక, సాంఖ్యయోగము మిగిలిన 62 శ్లోకములలోనే యిమిడియున్నది. 11వ శ్లోకము మొదలు 72వ శ్లోకమువరకు ఉన్న 62 శ్లోకములు విమర్శించినచో విషయవారీగా నాల్గు భాగములు తేలును.

1. అశోచ్యత్వబోధ, ఆత్మతత్త్వబోధ (11వ శ్లోకము నుంచి 38వ శ్లోకం వరకు)

II ఆత్మతత్త్వజ్ఞుడు అనుస్థితప్రజ్ఞుల ల క్ష ణా లు (54 నుంచి 72 వరకు)

III నిష్కామకర్మబోధ (39 శ్లోకంనుంచి 51 వ శ్లోకము వరకు)

IV నిష్కామకర్మకు అవధి (52, 53 శ్లోకములు)

I అశోభ్యత్వబోధ:- (11 నుంచి 38 శ్లోకమువరకు)

యీ అశోభ్యత్వబోధ 11 వ శ్లోకము నుంచి 38 వ శ్లోకమువరకు ఉన్న 28 శ్లోకాలలో 5 విధములుగా చేయబడినది.

1. అద్వైతదృష్ట్యా అశోభ్యత్వము

2. ద్వైతదృష్ట్యా అశోభ్యత్వము

3. స్వధర్మదృష్ట్యా అశోభ్యత్వము

4. చార్వాకదృష్ట్యా అశోభ్యత్వము

5. లౌకికదృష్ట్యా అశోభ్యత్వము.

1. అద్వైతదృష్ట్యా అశోభ్యత్వము :-

'బ్రహ్మ సత్యం జగన్మిధ్యాజీవో బ్రహ్మైవనాపరః' ||

అనునది అద్వైత సిద్ధాంతము. బ్రహ్మలేక ఆత్మఒక్కటే సత్యమనియు, జగత్తంతయు మిథ్యయనియు; జీవుడు వాస్తవంగా బ్రహ్మయేకాని అన్యుడు కాడనియు దీనిభావము. ఈ విచారణలో (1) ఆత్మతత్త్వ విచారణ (2) జగన్మిథ్యాత్వ విచారణ అనునవి ప్రధానములు. ఆరెంటిని పరిశీలించుదము.

(1) ఆత్మతత్త్వవిచారణ:- (11 టు 25, 29, 30 శ్లోకాలు)

అద్వైతసిద్ధాంతరీత్యా ఆత్మనిత్యము, ఏకము, సర్వవ్యాపకము, నిరవయవము, ఆశ్చర్యము, శాస్త్ర ప్రమాణికము అయ్యున్నది. నిత్యము అనుటవల్ల అజము, అవ్యయము నిర్వికారము, నిష్క్రియము, షడ్భావవికారశూన్యము అని స్పష్టమగుచున్నది. 2వ అధ్యాయములోని 11, 12, 13, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 29, 30 శ్లోకములు పై భావములను విశదీకరించుచున్నవి. వానిలో 17, 18, 30 శ్లోకములు ప్రతి ఉపాధిలోను ఆత్మలు వేరుగా లేవనిన్నీ, అన్ని ఉపాధులలోనూ ఉన్న ఆత్మ ఒక్కటే అనిన్ని ఆత్మ నానాత్వమును నిరసించుచూ, ఆత్మైకత్వమును ప్రతిపాదించుచున్నవి. దీనిని బట్టియే జీవబ్రహ్మైక్యముకూడ స్పష్టమగుచున్నది. 25వ శ్లోకము ఆత్మప్రత్యక్షప్రమాణము నకును, అనుమాన ప్రమాణము నకును అందనిదిన్నీ, వాక్కుకు, మనస్సుకుకూడ గోచరించనిదిన్ని శాస్త్రప్రమాణం వల్లనే తెలిసికోతగిన దనిన్నీ స్పష్టము చేయుచున్నది. ఇట్టి ఆత్మ తత్త్వబోధకు సాధన చతుష్టయసంపత్తి అవసరము కనుక అట్టి సంపత్తి 14 , 15 శ్లోకాలలో బోధచేయబడినవి.

2. జగన్మిథ్యాత్వవిచారణ:- (28, 16 శ్లోకములు)

2వ అధ్యాయములోని 28, 16 శ్లోకములు జగన్మిథ్యాత్వమును నిరూపించుచున్నవి. 28వ శ్లోకములో ఈ జగత్తుకు ఆదిమధ్యాంతములలో ఆది అంతములు అవ్యక్తములు అనగా తెలియబడనివి. లేనివి అనిన్నీ, మధ్యము మాత్రము వ్యక్తము అనగా తెలియబడేదనిన్నీ. అనగా కనబడుట మాత్రమే లక్షణముగా కలదనిన్నీ స్పష్టమగుచున్నది. దేనికైతే వస్తుత్వం లేకుండా, దృశ్యత్వం మాత్రమే ఉంటుందో అది మిథ్య అని శాస్త్రము చెప్పుచున్నది. కనుక జగత్తు మిథ్య అని 28 వ శ్లోకము నిరూపించుచున్నది.

ఇంకను 16 వ శ్లోకము ఉన్నవస్తువుకు లేమి లేదనిన్నీ లేనిదానికి ఉనికి లేదనిన్నీ చెప్పుటవల్లను; ఉన్నవస్తువు అనగా ఆత్మ అనిన్నీ లేనిది అనగా అనాత్మ లేక జగత్తు అనిన్నీ అర్థము. కనుక, ఆత్మకు అభావము అనగా లేక పోవుట ఎప్పుడూ ఉండదనిన్నీ, అనాత్మయైన జగత్తునకు ఉనికి అనగా వస్తుత్వము, సత్యత్వము ఎప్పుడు ఉండనేరదనిన్నీ స్పష్టమగుచున్నది. దీనిభావము. ఉన్నది ఏప్పుడూ ఉంటుంది. లేనిది ఎప్పుడూ లేదు అని తేలుచున్నది. ఇంత స్పష్టమైన విషయమై కృష్ణుడంతటివాడు మనకు బోధచేయవలెనా? అని సందేహము కలుగవచ్చును. ఈ విషయముపైకి స్పష్టముగా కనపడుచున్నదే కాని, వాస్తవంలో మనము అనుకున్నంత స్పష్టముకాదు. ఉన్న వస్తువుకు లేమిలేదు. లేని దానికి ఉనికి లేదు అని చెప్పుటలో రెండురకములైన ప్రతిషేధములు కనపడుచున్నవి. ఉన్నదానికి లేమి లేదు అను ఒక ప్రతిషేధము, లేనిదానికి ఉనికి లేదు అను రెండవ ప్రతిషేధము కనపడుచున్నవి, ప్రతిషేధము అనగా లేదు అని చెప్పుట ప్రసక్తి వచ్చినపుడు ప్రతిషేధించవలెను కాని ప్రసక్తియే లేనపుడు ప్రతిషేధించుటకు అవసరమే లేదుకదా, ఒక దృష్టాంతమును తీసికొందము. ఒక పిల్లవాడు కత్తితో తెలియక తనచేతినికోసుకోపోతుంటే, దానివల్ల వానికనర్థము కనుక, "అబ్బాయీ! కోసుకోవద్దు" అని ప్రతిషేధిస్తాము; అనగా వద్దని చెప్పుతాము; కాని అతని చేతిలో కత్తియే లేనపుడుకాని, ఉన్ననూ కోసుకునే ధోరణి లేనినపుడుగాని కోసుకోవద్దని చెప్పముకదా; అట్లు చెప్పుటకు అసలు అవసరమే లేదుకదా. కనుక ఒక విషయం ప్రసక్తమైతేను, దానివల్ల నష్టంవచ్చేటట్లైతేనూ, అప్పుడు ఆపనిని చేయవద్దు అని చెప్పుట సబబు అని అందరికి తెలిసినదేకదా. ఇప్పుడు ఆత్మకు అభావము లేదు. అనగా ఆత్మ లేకపోవుటలేదు. అని ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే, ఆత్మ కంటికి కనపడుటలేదు కనుక, లేదు అని అనుకొవటానికి అవకాశముకలుగుచున్నది కనుకను, ఆత్మ లేదు అని అనుకునేపక్షంలో గొప్ప అనర్థమున్నది కనుకను, ఆత్మ కనపడనంత మాత్రాన, లేదు అని అనుకోవద్దు. అని ప్రతిషేధించవలసి వచ్చినది . అటులనే జగత్తుకంటికి కనబడుచున్నది కనుకను, కనపడుచున్నంత మాత్రాన ఉన్నది అనగా సత్యమైనది, నిత్యమైనది అని అనుకోవటానికి అవకాశమున్నది కనుకను, అట్లు జగత్తు సత్యమైనది అని అనుకునేట్లైతే అనర్థము కలుగును కనుకను, అట్టి పొరపాటుపడి చెడిపోకుండా ఉండుటకై కనపడు చున్నను జగత్తునకు సత్యత్వము లేక వస్తుత్వము లేదు అని బోధ చేయవలసివచ్చినది, కనుక, కనపడకపోయినా ఆత్మ ఎప్పుడూ ఉండేదే, కనపడినా జగత్తు వస్తుత్వంలేనిదే; ఇట్టి వస్తుత్వం లేని అనాత్మయైన జగత్తును నమ్మి చెడిపోక వస్తువుఐన ఆత్మను సాక్షాత్కారము చేసికొని బాగుపడుము అనుబోధ అవసరమైనది. ఇట్టి వస్తుత్వం లేకుండా కనపడుట మాత్రమే లక్షణముగా కలదానిని మిథ్య అని అంటారు. మిథ్యఅంటే కనపడనిది అని అర్థం కాదు; కనపడినను వస్తుత్వంలేనిదే అని అర్థము. ఇంకను కుందేటి కొమ్ము అనుదానికి వస్తుత్వం లేదు. వస్తుత్వం లేనంత మాత్రాన దాన్ని మిథ్య అని అనము. ఎందుచేతననగా, అది అసలే కనపడదు కనుక; వస్తుత్వంలేనిది, కనపడనిది తుచ్ఛము లేక అసత్‌ అని అంటారు. ఇప్పుడు జగత్తు కనపడుచున్నది కనుక కుందేటి కొమ్మువలె తుచ్ఛంకాదు, అసత్‌ కాదు, పోనీ, ఆత్మ వలె నిత్యంగా, సత్యంగా ఎప్పుడూ ఎట్టి మార్పు లేకుండా సత్‌ గా ఉంటుందా అంటే, అలా ఉండదు; ఎప్పుడూ మారుతూ అనిత్యంగా ఉన్నది. కనుక జగత్తు ఆత్మవలె సత్‌ కాదు; కుందేటి కొమ్మువలె అసత్‌ కాదు. ఇట్టి సత్‌ కానటువంటిన్నీ అసత్‌ కానటువంటిన్నీ దానిని మిథ్య అని అంటారు. జగత్తు అటువంటిది కనుక మిథ్య అని చెప్పబడుచున్నది.

ఈ విధంగా అద్వైతదృష్ట్యా ఆత్మ నిత్యము, ఏకము కనుకను, అది నశించేది కాదు కనుకను, అది నశించును అని శోకింపకూడదు, అని అసోచ్యత్వబోధ. ఇంకను శరీరములు నశించిపోవును కనుక, అట్టి శరీరనాశనముకైనను దుఃఖించుట తగినదే కదా అని అంటావేమో, శరీరములు మిథ్య కనుక, స్వప్నములోనిశరీరములవంటివి కనుక అట్టి శరీరముల నాశనమునకు శోకింప నవసరములేదు అని అశోచ్యత్వబోధ. ఇది అద్వైతదృష్ట్యా అశోచ్యిత్వబోధ.

(2). ద్వైతదృష్ట్యా అశోచ్యత్వము:- (12 వ శ్లోకము)

ద్వైతసిద్ధాంత ప్రకారము ఆత్మకు ఏకత్వము లేదు. ఆత్మలు అనేకములు. ప్రతి శరీరములోను ఆత్మలు వేరు వేరుగా నుండును. ఇట్లు ప్రతి శరీరములోనూ ఆత్మలు వేరు వేరుగా నున్నను, ఆ ఆత్మలు నిత్యమైనవి; అ వెప్పుడును నశించేవి కావు.

2వ అధ్యాయములోని

శ్లో || నత్వేవాహం జాతునాసం నత్యంనేమే జనాధిపాః ||

నచైవనభవిష్యామ సర్వేవయమతః పరం ||

అను 12 వ శ్లోకములోని నేను, నీవు, వీరందరు నిత్యులే అను బహువచన ప్రయోగమువల్ల ఇట్టి ఆత్మనానాత్వమును వాదనకొరకు అంగీకరించినను, అట్టి ఆత్మలు నిత్యమైనవి నశించేవి కావు కనుక వానిని గురించి కూడ శోకింప తగదు, అని ద్వైతదృష్ట్యా అశోచ్యత్వబోధ. వాస్తవంలో 12 వ శ్లోకములోని నానాత్వము ఉపాధిదృష్ట్యా నానాత్వము కాని ఆత్మ నానాత్వ బోధకము కాదు.

(3) స్వధర్మదృష్ట్యా అశోచ్యత్వము:- (31. 32, 33, 37. 38, శ్లోకాలు)

గీత 2 వ అధ్యాయములోని 31, 32, 33, 37, 38 శ్లోకములలో ధర్మమైన యుద్ధముకంటె క్షత్రియునికి వేరే శ్రేయోదాయకము లేదనియు (31) అప్రయత్నంగా సిద్ధించిన అట్టి ధర్మయుద్ధము తెరచి ఉన్న స్వర్గద్వారము వంటి దనియు (32) అట్టి ధర్మయుద్ధము చేయనిచో స్వధర్మము కీర్తిచెడి పాపం వచ్చుననియు. (33) అట్టి యుద్ధములో చనిపోయిన స్వర్గము వచ్చుననియు, జయించిన రాజ్యము వచ్చుననియు ఉభయధా లాభ##మే కనుక తప్పక యుద్ధము చేయుమనియు (37) లాభాలాభములు, జయాపజయములు సుఖదుఃఖములను సమానంగా చూచుచు స్వధర్మమైన యుద్ధము చేస్తే పాపము రానేరాదనియు (38), కృష్ణుడు అర్జునునికి బోధించి ఈ విధంగా కూడ నీవు శోకింపతగవు అని అశోచ్యత్వమును స్వధర్మదృష్ట్యా కూడా బోధించినాడు.

(4) చార్వాకదృష్ట్యా అశోచ్యత్వము :- (26, 27 శ్లోకాలు)

ఒకవేళ ఆత్మనిత్యము కాదనియు, దేహముతో పుట్టి, దేహముతో చచ్చే స్వభావము కలదనియు, అని అనుకొన్నను పుట్టిన ప్రతి వస్తువు చనిపోవుట, చనిపోయినది తిరిగి పుట్టుట అనునవి తప్పించుటకు వీలులేని ధర్మములు కనుక, అట్టి తప్పించ వీలు లేని విషయములో నీవు శోకింప తగదు, అని చార్యాకదృష్ట్యా అశోచ్యత్వబోధ 26, 27 శ్లోకాలులో చేయబడినది.

(5) లౌకికదృష్ట్యా అశోచ్యత్వము :- (34, 35, 36 శ్లోకాలు)

దేవునియందు కాని, వేదమునందుకాని, పుణ్యపాపాలు స్వర్గనరకాలయందు కాని, ఆత్మ ఒకటి ఉన్నదని కాని, విశ్వాసం లేనివారు కేవలం లౌకికులు, చార్వాకులకు ఆత్మ ఒకటి ఉన్నదని, అది దేహమే అని విశ్వాస మున్నది కనుక వారి కంటె హీనులు ఈ లౌకికులు. అట్టి లౌకికులు కూడ ప్రతిష్ఠకు వాంఛిస్తారు. అర్జునా, ఇప్పుడు నీవు యుద్ధము చేయనిచో, నీవు శాశ్వతమైన అపకీర్తికి పాల్పడుతావు; గొప్ప వంశములో పుట్టినవారు అపకీర్తికి పాల్పడుటకంటె చచ్చుట మేలు (34), అర్జునుడు గొప్పవీరుడు, పరాక్రమం కలవాడు అని నిన్ను గౌరవించినవారందరు ఇప్పుడు నిన్ను యుద్ధములో గెలువలేక భయపడి పారిపోయినావు. శుద్ధ పిరికిపందవు అని గేలిచేస్తారు (35) యీలా నిన్ను అనరాని మాటలు అని నిందిస్తూ ఉంటే అట్టి అప్రతిష్ఠకు పాల్పడుకంటె దుఃఖకరమైన దేమున్నది? (36) కనుక శోకింపతగవు అని కృష్ణునిచేత లౌకికదృష్ట్యా కూడా అశోచ్యత్వబోధ గావింపబడినది.

ఈపై అయిదు పద్ధతులు కంటె వేరే యింకొకపద్ధతి లేనేలేదు. ఏ పద్ధతిలో కూడా అర్జునా నీవు శోకింప తగవు అని కృష్ణుడు అర్జునునికి అశోచ్యత్వమును బోధించినాడు.

II. స్థితప్రజ్ఞ లక్షణాలు (54 శ్లోకం నుంచి 72 శ్లోకం వరకు)

ఈ అశోచ్యత్వ బోధలో ఆత్మనిత్యమైనది, ఏకమైనది సర్వవ్యాపకమైనది, సచ్చిదానందానంత రూపమైనది అను అద్వైతబోధయేప్రధానమైనది. వాదనకొరకుమిగతాదృష్టులు అంగీకరింపబడినవే కాని, వానియందు ముఖ్య తాత్పర్యము లేదు. ఇట్టిది అభ్యుపగమ్యవాద మంటారు. ఆత్మత్త్వం తెలిసినవారికి జగత్తు స్వప్నం వలె మిథ్య. వారెప్పుడు ఆత్మానందములోనే ఉంటారు. అట్టివారినే స్థిత ప్రజ్ఞులంటారు. అట్టివారి లక్షణాలు తెలిసికొనవలెనని అర్జునుడు 54వ శ్లోకములో కృష్ణుని కోరగా కృష్ణుడు 55 శ్లోకమునుంచి 72 వ శ్లోకం వరకు అట్టి లక్షణాలను చక్కగా బోధించినాడు.

అర్జునుడు అడిగిన 54 శ్లోకంలో 4 ప్రశ్న లున్నవి. అవేమనగా

1. సమాధిలోనున్న స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమి ?

2. బహిర్ముఖుడైన స్థితప్రజ్ఞుడు కష్టసుఖములందు ఎట్లు ప్రవర్తిస్తాడు ?

3. బహిర్ముఖుడైన స్థితప్రజ్ఞుని అవయవములు ఎట్లుండును ?

4. బహిర్ముఖుడైన స్థితప్రజ్ఞుడు ఎట్లు వ్యవహరిస్తాడు ?

1వ ప్రశ్న :- సమాధిలోనున్న స్థితప్రజ్ఞుని లక్షణాలు ఏమి ?

దీనికి జవాబు శ్రీ కృష్ణభగవానునిచే 55 వ శ్లోకములో చెప్పబడినది. సమాధిలోనున్న స్థిత ప్రజ్ఞుడు ఎప్పుడు ఆత్మానందములోనే ఉంటాడు. అతడు మనోగతములయిన కామము లన్నిటిని సంపూర్తిగ త్యజిస్తాడు. ఆత్మకు ఎట్టికోరికలులేవు. సమాధిలో మనస్సుకూడ పనిచేయదు. కనుకను ఆత్మేతర మేమియు లేదు కనుకను, ఆత్మ ఆనందస్వరూపమే కనుకనూ, అతడు ఎల్లపుడు నిత్య నిరతిశయ నిరుపాధిక మైన ఆత్మానందములో ఉంటాడు.

2వ ప్రశ్న :- బహిర్ముఖుడైన స్థితప్రజ్ఞుడు కష్టసుఖములందు ఎట్లు ప్రవర్తించును ?

దీనికి జవాబు 56, 57 శ్లోకములలో చెప్పబడినది. బహిర్ముఖుడైన స్థితప్రజ్ఞుడు కష్టములు ప్రాప్తించితే క్రుంగి పోడు. సుఖాలు వస్తే పొంగిపోడు. ఏపరిస్థితులలోనూ అతనిమనస్సు ఉద్వేగమును కాని వికారముకాని పొందదు. అతనికి రాగ, భయ, క్రోధములుండవు (56). ఇంకను అతడు శుభములు వచ్చినపుడు శుభములు కలుగచేసినవారిని అభినందింపడు. అశుభములు వచ్చినపుడు ఆ అశుభములు కలుగచేసిన వారిని ద్వేషింపడు. మరియు అతనికి శరీరాదుల విషయమై ఏ మాత్రము కూడ ఆసక్తి ఉండదు (57).

3వ ప్రశ్న:- బహిర్ముఖుడైన స్థిత ప్రజ్ఞుని అవయవము లెట్లుండును ?

దీనికి జవాబు 58, 59, 60, 61, 62, 63 అను శ్లోకములలో చెప్పబడినది. తాబేలు తన అవయవములను సంపూర్తిగ తన వశములో ఉంచుకున్నట్లుగా బహిర్ముఖుడైన స్థిత ప్రజ్ఞుడు తన యింద్రియములను విషయములలో నుంచి ఉపసంహరించుకొని, తన వశములో ఉంచుకుంటాడనిన్నీ (58) నిరాహారునికి కూడా యింద్రియములు విషయాల మీదకు పోనట్లు కనబడిననూ, అట్టి వానికి విషయవాంఛమిగిలే ఉంటుంది అనిన్నీ, అట్టి వాంఛకూడా ఆత్మసాక్షాత్కార మైతేనే పోతుంది అనిన్నీ (59), ఎంత విద్వాంసుని అయినను యింద్రియములు పొగరుమోతు గుఱ్ఱాలవలె పెడత్రోవకు లాగి మనస్సును హరించును గనుక యింద్రియములను ఎపుడు వశములో ఉంచుకొనవలెననిన్నీ, ఎవరికైతే యింద్రియములు అలావశములో ఉండునో అట్టివాడే స్థితి ప్రజ్ఞుడనిన్నీ (60,61), విషయధ్యానమువల్ల విషయములందు ఆసక్తి అనుసంగం కలిగి ఆసంగంలో నుంచి కామము పుట్టి, ఆ కామములోనుంచి క్రోధము, దానిలోనుంచి సమ్మోహము, సమ్మోహములోనుంచి స్మృతిభ్రంశము, దానిలోనుంచి బుద్ధినాశనము కల్గి మానవుడు జీవించియుండగానే జీవచ్ఛవమువలె అగుననిన్నీ, స్థితిప్రజ్ఞుడు యిట్టి పరిస్థితికి అతీతముగా ఉంటాడనిన్నీ (62, 63) చెప్పబడినది.

4 వ ప్రశ్న:- బహిర్ముఖుడైన స్థిత ప్రజ్ఞుడు ఎట్లు వ్యవహరిస్తాడు ?

దీనికి జవాబు 64 శ్లోకమునుండి 71 శ్లోకమువరకు ఉన్న 8 శ్లోకాలలో చెప్పబడినది. అట్టి స్థితప్రజ్ఞుని ఇంద్రియములు రాగద్వేషములు లేనివై అతని వశములో ఉండును కనుక అట్టి ఇంద్రియములతో విషయములను అనుభవించుచూ వ్యవహరించినను, అతని మనస్సులో ప్రసాదము, శాంతి ఉండుననిన్నీ (64) అట్టి ప్రసాదమువల్ల సర్వదుఃఖ హానికలిగి సర్వాత్మభావము కలుగుననిన్నీ (65), ఇంద్రియ వశంలో లేనివాడికి శాంతిసుఖములు ఉండనేరవనిన్నీ (66), ఇంద్రియములు వశంలో లేకపోతే అవి మనస్సును చుక్కానిలేని పడవను గాలివలె అటూ ఇటూ చెదరగొట్టి పాడుచేస్తవనిన్నీ (67), కనుక ఎవరి ఇంద్రియములు విషయముల మీదికి పోకుండా వశంలో ఉండునో వాడే స్థితప్రజ్ఞుడనిన్నీ (68), ఆత్మజ్ఞానము అజ్ఞానికి చీకటిరాత్రి వంటిదనిన్నీ, స్థిత ప్రజ్ఞునకు పగలువంటిదనిన్నీ, అజ్ఞానికి పగలుగా ఉన్న జాగ్రత్‌ ప్రపంచము స్థిత ప్రజ్ఞునికి చీకటిరాత్రివంటిది అనగా మిథ్య అనిన్నీ (69), ఎన్ని నదులు సముద్రములో ప్రవేశించినా సముద్రము నిర్వికారంగా ఉన్నట్లు ఎన్ని కామములు స్థితప్రజ్ఞునిలో ప్రవేశించినట్లు కనబడినను, అతను నిర్వికారముగా పరమశాంతితో ఉంటాడనిన్నీ (70), కనుక ఎవరైతే సర్వకామములు పూర్తిగా త్యజించి, నిస్పృహుడై అహంకారమమకారములు లేకుండా విషయములలో వ్యవహరించిననూ అట్టివాడు స్థిత ప్రజ్ఞుడే అనిన్నీ, అట్టివానికి నిరతి శయమైన శాంతి ఉండుననిన్నీ (71), బహిర్ముఖుడైన స్థిత ప్రజ్ఞుని వ్యవహారము వర్ణింపబడినది.

చివరకు 72వ శ్లోకంలో ఇట్టి స్థితప్రజ్ఞస్థితి బ్రాహ్మీస్థితి అనిన్నీ, ఇట్టి స్థితి అవసానకాలంలో వచ్చినా వాడు ముక్తుడే అనిన్నీ, వానికెట్టి మోహము తిరిగి కలుగదనిన్నీ, పడుచుతనంలో నుండగానే అట్టిస్థితి సంభవించినచో ఇంక అట్టిస్థితి వర్ణనాతీతమనిన్నీ స్థితప్రజ్ఞుని మహాత్మ్యము వర్ణించబడినది. దీనివల్ల అట్టి స్థిత ప్రజ్ఞుడు జీవన్ముక్తుడే అని జీవన్ముక్తి కూడ విశదీకరింపబడినది. అట్టి స్థిత ప్రజ్ఞుని లక్షణాలను లక్ష్యమందుంచుకొని, సాధకుడు సాధన చేయవలెనని సాధకునికి బోధ చేయబడినది.

III నిష్కామ కర్మబోధ: (39 నుంచి 51 శ్లోకాలు)

ఈ సాంఖ్య యోగము అను 2వ అధ్యాయంలో ఆత్మ తత్త్వమున్ను అట్టి ఆత్మజ్ఞానమువల్ల మోక్షము అనిన్నీ బోధింపబడుటయేకాక అట్టి ఆత్మజ్ఞానమునకు సాధనమైన కర్మయోగము అను నిష్కామకర్మకూడ బోధింపబడినది. 38వ శ్లోకంవరకు ఆత్మతత్త్వమును అశోచ్యత్వమును బోధించి, ఆ పైన 39 వ శ్లోకం నుంచి 51 వ శ్లోకంవరకు కర్మయోగమును కృష్ణపరమాత్మ బోధించినాడు. ఈ పదమూడు శ్లోకములలో కర్మయోగము 4 విధములుగా బోధింపబడినది.

1. కర్మయోగమహాత్మ్యము (39 నుండి 41 వ శ్లోకం వరకు)

ఈ కర్మయోగంవల్ల కర్మబంధం పోతుందనిన్నీ (39), దీనిని ప్రారంభించి మధ్య విడచినను, చేసినంతవరకైననూ ఫలం వస్తుందనిన్నీ ప్రత్యవాయము రాదనిన్నీ, చేసినది స్వల్పమైననూ గొప్ప సంసారభయమునుండి రక్షిస్తుందనిన్నీ (40), ఇట్టిది సమ్యక్‌ ప్రమాణజనిత మగుటచే ఏకరూపమై నిశ్చయాత్మకమైన చక్కని రాజబాట అనిన్నీ, అట్లు నిశ్చయాత్మకము లేనివారి బుద్ధులు అనంతములై సందుత్రోవలను పట్టునేకాని మోక్షమార్గమైన రాజబాటకు రావనిన్నీ (41) బోధింపబడినది.

2. కామ్యగర్మనింద (42 నుంచి 44 శ్లోకాలు)

ఆ తరువాత కామ్యకర్మములోని దోషములను బోధిస్తేనేకాని నిష్కామకర్మ ఆవశ్యకత తెలియదు కనుక, కామ్యకర్మవల్ల జననమరణ ప్రవాహంలో పడుటయే ఫలమనిన్నీ, స్వర్గానికి వెళ్ళినా, ఆ స్వర్గభోగం అయిపోగానే తిరిగి భూలోకంలో పుట్టవలసినదే అనిన్నీ, ఇట్టిది భోగలాలసతకు త్రోవచూపి, నిశ్చయాత్మకమైన మోక్షమార్గమునకు రానివ్వదనిన్నీ చెప్పబడినది.

3. కర్మయోగము జ్ఞానమునకు సాధనము అనుబోధ (45, 46 శ్లోకాలు)

కామ్యకర్మములను వదలి నిష్కాముడవై, ద్వంద్వములను సహించి సత్వప్రధానమైన మనస్సు కలవాడవై యోగక్షేమములను ప్రారబ్ధాధీనములని వదలి, ఆత్మజ్ఞానము కలవాడుగా కావలెననిన్నీ (45), కర్మయోగఫలమంతయు జ్ఞానయోగఫలములో అంతర్భాగమనిన్నీ (46), బోధింప బడినది.

4. కర్మయోగబోధ (47 నుంచి 51 వరకు)

అర్జునా! నీకు కర్మచేయుటయందే అధికారముకాని దాని ఫలమునందు అధికారము లేదు. కర్మ ఫలానికి కారణుడవు కావద్దు, ఫలం కోరకపోతే కర్మచేయుట ఎందుకు అని కర్మను మానేయకూడదు. (47), ఫలమునందు సంగమును విడిచి, ఆ కర్మసఫలమైనను నిష్పలమైనను మనస్సును సమానంగా, నిర్వికారంగా ఉంచుకొని కర్మను చేయవలెను (48), నిష్కామకర్మకంటె కామ్యకర్మ చాలా హీనము (49), నిష్కామ కర్మయోగి సుకృతదుష్కృతముల రెంటిని విడచి మోక్షమార్గానికి వెళ్ళుతాడు. బంధస్వభావముకల కర్మను బంధము కలుగకుండా చేయుటే కౌశలము (50), అట్టి నిష్కామకర్మ చేయువాడు కర్మఫలమైన బంధమును విడచి, పునరావృత్తి రహితమైన మోక్షమును పొందుతాడు (51) అని బోధింపబడినది.

IV కర్మయోగమునకు అవధి : (52, 53 శ్లోకాలు)

ఇట్టి కర్మయోగము ఎంతవరకు చేయవలె నంటే (i) ప్రపంచ విషయములందు మోహము పోయేవరకు (52), అనిన్నీ (ii) బుద్ధిలో ఉన్న నానాత్వము పోయి బుద్ధి గాలి లేనిచోట ఉన్న దీపంవలె కదలకుండా నిశ్చలంగా ఉండే వరకూ (53) అనిన్నీ, చెప్పబడినది. ఇట్లు బుద్ధికుండే 2 రకములైన విక్షేపములు పోతే అతడు కర్మయోగమును దాటిన వాడై జ్ఞాన యోగమునకు అధికారి అగునని బోధించి ఆపైని జ్ఞానియైన స్థితప్రజ్ఞుని లక్షణాలు బోధింపబడినవి.

ఇట్లు 2 వ అధ్యాయమైన సాంఖ్యయోగములో (1) ఆత్మజ్ఞానబోధ (2) దానికి సాధనమైన నిష్కామ కర్మబోధ చేయబడినది.

___

Geetha Koumudi-1    Chapters